పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారుః ప్రధాని మోడీ

కామారెడ్డి నుంచి కెసిఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించాలని పిలుపునిచ్చిన మోడీ

pm-modi-public-meeting-in-kamareddy

కామారెడ్డి: మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ అని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని మాట ఇచ్చామని దానిని నిలబెట్టుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బిజెపి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పలుమార్లు నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ… కేంద్రంలో తనలాంటి ఓ బీసీని ప్రధానిగా చేసిన ఘనత బిజెపిదే అన్నారు. బిజెపి మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుందన్నారు. కేంద్ర కేబినెట్లో అత్యధికమంది బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. కానీ దళితుడిని సీఎంగా చేస్తానని చెప్పిన కెసిఆర్… ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.

తెలంగాణ వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల్లో ఆశలు కనిపిస్తున్నాయని, ఇది మార్పుకు నిదర్శనమన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని తెలిపారు. బిజెపి చెప్పింది చేసి తీరుతుందన్నారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రైతులకు గిట్టుబాటు ధర, సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్, రామమందిర నిర్మాణం… ఇలా ప్రతి హామీని నిలబెట్టుకున్నామన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజనులకు యూనివర్సిటీ వంటి తదితర హామీని కూడా నిలబెట్టుకున్నామన్నారు. తెలంగాణను బిఆర్ఎస్ నుంచి విముక్తి కలిగించాలని పిలుపునిచ్చారు.

ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఏటీఎం వద్దకు వెళ్తారని, కానీ బిఆర్ఎస్ మాత్రం కొత్త నీటి పారుదల ప్రాజెక్టులు చేపడుతుందని విమర్శించారు. బిఆర్ఎస్‌కు డబ్బులు అవసరమైతే కొత్త పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బు బిఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. బీసీలకు, దళితులకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై యువత చాలా కోపంతో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తీరుతో వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు బీసీలకు, దళితులకు ఏమీ చేయలేవన్నారు.

టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ మార్చుకున్నంత మాత్రాన వారు చేసిన అవినీతి రూపుమాసిపోదన్నారు. అలాగే యూపీఏ నుంచి ‘ఇండియా’ అని మార్చుకున్నంత మాత్రాన వారి తీరు మారదన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న కామన్ పాయింట్ అవినీతి అని ధ్వజమెత్తారు. తెలంగాణ రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పారు. కామారెడ్డి నుంచి సిఎం కెసిఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని, వీరిద్దరూ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని ప్రజలు వారికి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. రెండుచోట్ల పోటీ చేస్తున్నారంటే వారిలోని నిరాశ మనకు అర్థమవుతోందన్నారు. పేదల కోసం పని చేసే పార్టీ బిజెపి మాత్రమే అన్నారు. దేశంలో ఓ సమయంలో ఇద్దరు ఎంపీలు ఉన్నారని, ఆ సమయంలో తమను విపక్షాలు ఎగతాళి చేశాయన్నారు. ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు అందులో తెలుగు ప్రజలు ఇచ్చిన సీటు ఒకటి అని గుర్తు చేశారు. ఇప్పుడు మీ దయవల్ల 300కు పైగా ఎంపీ స్థానాలు సాధించామన్నారు.

మాదిగ సామాజిక వర్గానికి మరోసారి హామీ..

ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజవర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. వారికి న్యాయం చేసే బాధ్యతను బిజెపి తీసుకుందని చెప్పారు. మాదిగల సాధికారతకు కోసం మేం కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నామని హామీ ఇచ్చారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని, అక్కడ మీకు న్యాయం జరిగేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి నిన్న తాను అధికారులతో మాట్లాడానన్నారు. ఇప్పటికే కమిటీ ప్రకటించామని, వారికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.