బీసీలు సలహాదారులుగా పనికిరారా? : అచ్చెన్నాయుడు

‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు

Atchannaidu who launched the book ‘Jagan Reddy who is breaking BC back’

అమరావతిః మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ‘బీసీల వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ఇతర టిడిపి నేతలు పాల్గొన్నారు.

పుస్తకావిష్కరణ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టిడిపి హయాంలో బీసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాల్లో బీసీ భవన్ లు నిర్మించామని చెప్పారు. భవిష్యత్తులోనూ టిడిపి బీసీలకు ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పదవుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఒక సామాజిక వర్గానిదే అసలైన అధికారం అని అచ్చెన్నాయుడు విమర్శించారు.

కోర్టు వద్దని చెప్పినా కూడా వినకుండా సలహాదారులను నియమిస్తున్నారని ఆరోపించారు. సలహాదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? సలహాదారులుగా బీసీలు పనికిరారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పట్ల బీసీలు భ్రమలు వీడాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.