ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్‌ మా ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’లాంటిదిః ప్రధాని మోడీ

pm-modi-kaala-teeka-report-to-congress-black-paper-on-center-performance

న్యూఢిల్లీః గత పదేళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన ‘బ్లాక్ పేపర్‌’ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్‌ తమ ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’ లాంటిదని వ్యాఖ్యానించారు. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ‘బ్లాక్‌ పేపర్‌’ను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ పత్రాన్ని విడుదల చేసిన వెంటనే ప్రధాని మోడీ.. పదవీకాలం ముగియనున్న ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు రాజ్యసభకు వెళ్లారు. సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ చర్యపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ఖర్గేజీ ఇక్కడ ఉన్నారు. ఓ పిల్లాడు ఏదైనా మంచి చేస్తే. ప్రత్యేక సందర్భంలో ఆ పిల్లాడికి మంచి దుస్తులు వేస్తే.. చెడు కల్లు పడకుండా ఉండేందుకు కుటుంబంలో ఎవరైనా దిష్టి చుక్క పెడతారు. అలాగే, గత 10 ఏళ్లుగా దేశం కొత్త శ్రేయస్సు శిఖరాలను అధిరోహిస్తోంది. అందుకు మన ప్రభుత్వంపై చెడు కన్ను పడకుండా మనం సురక్షితంగా ఉండేందుకు కాలా తిక (దిష్టి చుక్క) పెట్టే ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన బ్లాక్‌ పేపర్‌ మా ప్రభుత్వానికి దిష్టి చుక్క లాంటిదే. మాపై చెడు చూపులు పడకుండా చేస్తుంది. ప్రతిపక్షాల చర్యను మేం స్వాగతిస్తున్నాం. అందుకు నేను ఖర్గే జీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ మోడీ వ్యంగ్యంగా స్పందించారు.