ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందిః నితీశ్‌ కుమార్‌

Nitish Kumar Meets PM Modi, Says Will Never Leave NDA Again

న్యూఢిల్లీః ఇక ఎప్పటికీ ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగుతానని బీహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఎన్డీయే కూటమిని వదిలేసి ఉండొచ్చని కానీ, ఇక ఎప్పటికీ అలా చేయనని తెలిపారు. నితీశ్‌ కుమార్‌ ఇటీవలే మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెందపులు చేసుకొని బిజెపితో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం నితీశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

‘బీహార్‌లో ఎన్డీయే కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు సేవ చేయడమే మా ప్రాథమిక లక్ష్యం. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థ నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుకుంటుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది’ అని ఆయన అన్నారు. 2013లో ఎన్డీయేతో తన బంధాన్ని తెంచుకోకముందు 1995 నుంచి బిజెపితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నితీశ్‌ గుర్తు చేసుకున్నారు.

‘2013లో నేను ఎన్డీయే కూటమితో బంధాన్ని తెంచుకున్నాను. అయితే అంతకంటే ముందు 1995 నుంచి 2013 వరకు మా జేడీయూ పార్టీ బిజెపికి మిత్రపక్షంగానే వ్యవహరించింది. ఇప్పటిదాకా రెండుసార్లు ఎన్డీయేను విడిచిపెట్టాను. ఇకపై అలా జరగదు. ఎప్పటికీ ఎన్డీయే కూటమిని వదలను’ అని స్పష్టం చేశారు. ఇకపై ఎప్పటికీ ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతూ రాష్ట్ర ప్రజ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని వెల్లడించారు.