కేంద్ర- రాష్ట్ర సైన్స్ కాన్‌క్లేవ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడి

YouTube video
PM Modi inaugurates Centre-State Science Conclave

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర-రాష్ట్ర సైన్స్ కాన్‌క్లేవ్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీలో రెండు రోజుల పాటు ఈ కాన్‌క్లేవ్‌ జరగనుంది. అయితే మొట్టమొదటి సారిగా సెంటర్-స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్ అనే పేరుతో ఈ సారి ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ , బిహార్ మినహా అన్ని రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ… ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలు, యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తల భాగస్వామ్యాన్ని అందిపుచ్చుకోవచ్చన్నారు. భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహిస్తుందన్న మోడీ, భారతదేశ సైన్స్ అభివృద్ధికి, ఈ రంగానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది చెప్పుకొచ్చారు.

మన శాస్త్రవేత్తల విజయాలను మనం సెలబ్రేట్ చేసుకోవాలని, మన శాస్త్రవేత్తలను, వారి ఆవిష్కరణలను తెలుసుకున్నప్పుడే సైన్స్ మన సంస్కృతిలో భాగమవుతుందని ప్రధాని మోడీ చెప్పారు. సైన్స్ ఆధారిత అభివృద్ధి దృక్పథంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా మోడీ తెలిపారు. 2014 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెరిగాయని, ప్రభుత్వ కృషి కారణంగా, భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ స్థానం నుంచి 46వ స్థానానికి చేరామని తెలిపారు. నేటి యువత సాంకేతికతకు త్వరగా అలవాటు పడుతున్నారని మోడీ అన్నారు. ఈ అమృత్ కాల్‌లో మనం భారతదేశాన్ని పరిశోధన, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘సెంటర్- స్టేట్ సైన్స్ కాన్ క్లేవ్’ మన ‘సబ్ కా ప్రయాస్’ మంత్రానికి ఉదాహరణ అని ప్రధాని మోడీ చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/