తెలంగాణ కు పిడుగులాంటి వార్త తెలిపిన వాతావరణ శాఖ

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత మూడు రోజులుగా అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్త తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతుండగానే.. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పిరిక్‌ స్థాయి వరకు విస్తరించి ఉందని నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇక గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీలోకి వరద ప్రవాహం పెరిగింది. వర్షాలు ఇలాగే కొనసాగితే నగరంలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడే ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు.