ఆ ఘటన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోడీ

pm-modi-declined-to-talk-with-imran-khan-post-pulwama-incident

న్యూఢిల్లీః 2019లో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేశాయని పాక్‌కు భారత మాజీ హై కమిషనర్‌ అజయ్‌ బిసారియా తెలిపారు. ఈ క్రమంలోనే నాటి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. భారత ప్రధాని నరేంద్రమోడీతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుకు మోదీ విముఖత వ్యక్తం చేసినట్లు ఈ విషయాన్ని తన పుస్తకంలో బయటపెట్టారు.

భారత్‌, పాక్‌ మధ్య దౌత్య సంబంధాలపై ఆయన రాసిన పుస్తకం త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో వీటిల్లో కొన్నింటిని ఓ జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ బంధించిన తర్వాత భారత్‌ తీవ్రంగా స్పందించిందని ఆ కథనంలో పేర్కొంది. అప్పుడు పాకిస్థాన్ పై 9 క్షిపణులతో దాడులకు సిద్ధమైందని ఈ విషయం తెలుసుకున్న పాక్‌ తీవ్రంగా భయపడిందని చెప్పారు. ఆ సమయంలో భారత్‌కు అప్పటి పాక్ హైకమిషనర్‌ సోహైల్‌ మహమ్మద్‌ ఇస్లామాబాద్‌లో ఉండగా.. ఫిబ్రవరి 27 అర్ధరాత్రి ఆయన తనను సంప్రదించారని అజయ్ బిసారియా తెలిపారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌.. మోడీతో ఫోన్‌లో మాట్లాడాలనుకుంటున్నారు’ అని చెప్పారని వెల్లడించారు.

కానీ, అప్పుడు ఖాన్‌తో మాట్లాడేందుకు ప్రధాని మోడీ అందుబాటులో లేరని అధికారులు చెప్పారని. పాక్‌కు ఏదైనా అత్యవసరమైతే హైకమిషనర్‌ తనతోనే మాట్లాడాలని చెప్పాలని సూచించినట్లు అజయ్ బిసారియా పేర్కొన్నారు. ఆ తర్వాత పాక్‌ మళ్లీ తనను సంప్రదించలేదని అజయ్‌ తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.