శరీరం రంగును చూసి ప్రజలను అవమానిస్తారా?..పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ కౌంటర్‌

PM Modi angry over Sam Pitroda’s comments

న్యూఢిల్లీః దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారన్న కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. పిట్రోడా చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూసి ప్రజలను అవమానిస్తారా? అని నిలదీశారు. చాలామంది ప్రజల శరీరం రంగు నలుపుగా ఉంటుందన్నారు. దాని ఆధారంగా యోగ్యతను నిర్ణయిస్తారా? అన్నారు.
శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని గుర్తుంచుకోవాలన్నారు. శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

కాగా, కోల్ కతాకు చెందిన ‘ద స్టేట్స్ మెన్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా భారత దేశాన్ని విభిన్నమైనదిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘దేశంలోని తూర్పు ప్రాంత ప్రజలు చైనీయుల్లా కనిపిస్తారు. పశ్చిమాన ఉండే వారు అరబ్ జాతీయుల్లా ఉంటారు. ఉత్తరాది వారు తెల్ల జాతీయులలా కనిపిస్తే దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు’ అని పేర్కొన్నారు.

మరోవైపు పిట్రోడా కామెంట్స్ ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతోపాటు బీజేపీ నేతలు తప్పుబట్టారు. ‘శామ్ భాయ్.. నేను దేశంలోని ఈశాన్య ప్రాంతానికి చెందిన వాడిని. నేను భారతీయుడిలా కనిపిస్తా. మేం చూసేందుకు భిన్నంగా కనిపించొచ్చు.. కానీ మేమంతా ఒక్కటే. దేశం గురించి కనీసం కొంచెమైనా అర్థం చేసుకో’ అంటూ హిమంత బిశ్వ శర్మ ‘ఎక్స్’లో కామెంట్ పోస్ట్ చేశారు.