ఈ నెల 25న ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలి – మంత్రి కేటీఆర్ పిలుపు

ఏప్రిల్ 25 బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశాల్లో భాగంగా పార్టీ పతాక ఆవిష్కరణ చేసి.. పలు అంశాలపై తీర్మానాలు, చర్చలు జరుపుతామని వెల్లడించారు. 22 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 23వ ఏట పార్టీ అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని అంశాలపై చర్చిస్తారని తెలిపారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు.

‘ ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించాం. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేశాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చినచిన్న ఇబ్బందులను కరెక్ట్‌ చేసుకుని ముందుకెళ్తాం. ‘ అని తెలిపారు.

అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు కేంద్రం కుట్ర చేస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నష్టాలను జాతికి అంకింతం చేసి లాభాలను నచ్చిన వ్యక్తులకు అప్పగించడమే కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని , వాటిని ప్రైవేటికరణ చేస్తే వచ్చే సమస్యలేంటో సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పారన్నారు. విశాఖ స్టీల్ కు, బయ్యారం ఉక్కుకు చాలా వత్యాసం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని విమర్శించారు.