ఈడీ నోటీసుల ఫై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కామెంట్స్

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ నోటీసుల ఫై స్పందించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆయనకు శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసు రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఇందులో ఉందనే వార్తలు ప్రచారం అయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ పాత కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తోంది.

ఈడీ నోటీసు ఆశ్చ‌ర్యంగా, విచిత్రంగా ఉందన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్. నోటీసులు నా బ‌యోడేటా అడ‌గ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని పేర్కొన్నారు. త‌న‌కు ఇచ్చిన నోటీసు వెనుకాల క‌క్ష‌పూరిత చ‌ర్య‌లు ఉన్నాయ‌న్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డకునేందుకే ఈ సమన్లు వచ్చాయని అనుకుంటున్నట్టు అన్నారు. ఈ నోటీసులకు తాను బెదిరేది లేదని అన్నారు. ఈ వ్యవహారంలో తగ్గేది లేదని తెలిపారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని అన్నారు. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా ? అని వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పని చేస్తున్నాయా ? అని ప్రశ్నించారు.