రాష్ట్రం విడిపోయిన – నా రికార్డును ఎవరూ మార్చలేరు : చంద్రబాబు

‘‘ 20 ఏళ్ల తర్వాత నన్ను గుర్తుపట్టకున్నా నేను హ్యాపీ!! రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు’’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ISB (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ద్విదశాబ్ది వేడుకలు ఈరోజు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ 20 ఏళ్ల తర్వాత నన్ను గుర్తుపట్టకున్నా నేను హ్యాపీ!! రాష్ట్రం విడిపోయింది.. అయినా నా రికార్డును ఎవరూ మార్చలేరు’’ అన్నారు. ‘‘విజన్ 2020’’ అని తాను ఆనాడు చెబితే వెకిలిగా మాట్లాడిన వాళ్లంతా.. ఆ విజన్ వల్ల అవతరించిన టెక్ హైదరాబాద్ ను చూసి కాలక్రమంలో కనువిప్పు పొందారని పేర్కొన్నారు. ఇప్పుడు తాను విజన్ 2029 తో ముందుకు పోతున్నానని చెప్పుకొచ్చారు.

బిల్ గేట్స్ తో తన తొలి మీటింగ్ కు సంబంధించిన పలు విశేషాలను ఈసందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘‘బిల్ గేట్స్ ఇండియాకు వస్తున్నారని తెలుసుకొని ఆయన అపాయింట్మెంట్ కోసం నేను ట్రై చేశాను. నేను ఆయన అపాయింట్మెంట్ అడిగితే.. రాజకీయ నాయకులతో నాకేం పని అని బిల్ గేట్స్ అన్నారట. ఎట్టకేలకు నాకు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. కేవలం 10 నిమిషాల కోసమే నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే హైదరాబాద్ ను టెక్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలపై నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బిల్ గేట్స్ ఆసక్తిగా విన్నారు. దీంతో కేవలం 10 నిమిషాలనుకున్న మీటింగ్.. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిందన్నారు.

20 ఏళ్ల క్రితం నాటిన చెట్టును చంద్రబాబు పరిశీలించారు. ఐఎస్‌బీ ఎందరో నాయకులను తయారు చేసిందని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. ప్రభుత్వాలతో కలిసి అనేక నైపుణ్య కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. చంద్రబాబుతో తమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతో విజన్ ఉన్న నేత చంద్రబాబు అని ఐఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు. చంద్రబాబు తీర్చిదిద్దిన సంస్థ అని, ఐఎస్‌బీ పురోగతి కోసం చంద్రబాబు అపార కృషి చేశారని ఐఎస్‌బీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు తలమానికం ఐఎస్‌బీ అని, ఐఎస్‌బీలో పరిశోధనలకు పెద్దపీట వేశామని డీన్ మదన్‌ పిల్లుట్ల తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్‌బీ పేరు గడించిందని, ఐఎస్‌బీ విద్యార్థులు వివిధ దేశాల్లో రాణిస్తున్నారని, కీలక సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని డీన్ మదన్‌ వెల్లడించారు.