మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత : టీడీపీ – వైస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ – వైస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మునిసిపల్ చైర్మన్ తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఈరోజు జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలోనే అదే వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న వైస్సార్సీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు ఎదురుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే వారిద్దరికీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అందుబాటులో ఉన్న రాళ్లు, కర్రలతో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ ఇంఛార్జ్.. బ్రహ్మారెడ్డి ఇంటికే నిప్పుపెట్టారు. మరో టీడీపీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేశారు దుండగులు. అంతే కాదు పలు వాహనాలకు సైతం నిప్పు పెట్టడం జరిగింది.

ఈ ఘర్షణపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. మాచర్లలో వైస్సార్సీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ అరాచక పాలనకు ఇదే నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై దాడులను ఖండించారు. కాగా టీడీపీ కావాలని గొడవ క్రియేట్ చేసిందని ఆరోపిస్తున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.