రిషికొండలో నిర్మాణాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

న్యాయ స్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్టున్నట్టు ఆరోపణలు

pil-filed-in-supreme-court-against-rushikonda-construction

అమరావతిః విశాఖలోని రిషికొండలో ఏపీ సర్కారు చేపడుతున్న నిర్మాణాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణం జరుగుతోందంటూ పర్యావరణవేత్త లింగమనేని శివరామ్ ప్రసాద్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు పేర్కొన్నారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని, దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు విచారణలో ఉన్నట్టు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నట్టు చెప్పారు.

ఏపీ ప్రభుత్వం చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/1ను ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ, వీటిని నిలువరించాలని శివరామ్ ప్రసాద్ కోరారు. హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఆఫీస్ లను తరలించే జీవోను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. రిషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం, విశాఖలో సీనియర్ అధికారుల కోసం కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా జీవో తీసుకొచ్చినట్టు వివరించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్, ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు రిషికొండలో నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కార్యాలయ తరలింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో, పత్రికల్లో వచ్చిన వార్తల కాపీలను జత చేశారు.