మా టీకా 90 శాతం కంటే ఎక్కువ పనిచేస్తోంది..ఫైజ‌ర్

అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వండి

pfizer-says-their-vaccine-is-more-than-90-percent-effective

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌పై ఫైజర్‌ కీలక ప్రకటన చేసింది. జర్మనీకి చెందిన తమ భాగస్వామి బయో ఎన్ టెక్ ఎస్ఈతో కలిసి తయారుచేసిన వ్యాక్సిన్ 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసిన సంస్థ, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి తీవ్రమైన అవాంఛనీయ పరిణామాలూ చోటు చేసుకోలేదని, ఇక ఈ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వాడే నిమిత్తం యూఎస్ అధికారుల అనుమతిని కోరుతున్నామని సంస్థ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బోరులా వెల్లడించారు.

ప్రపంచ శాస్త్రరంగంలో ఇది ఓ గొప్ప దినమని అభివర్ణించిన ఆయన, వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమంలో తాము కీలకమైన మైలురాయిని అధిగమించామని తెలిపారు. ప్రపంచానికి ఇప్పుడు కొవిడ్ పై సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ అవసరం ఎంతైనా ఉందని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఉపకరిస్తుందని తెలిపారు. ఇక ఈ వ్యాక్సిన్ తీసుకుంటే, ఎంతకాలం పాటు కరోనా వైరస్ ను శరీరం నియంత్రించగలదన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఇదే విషయమై స్పందించిన బయో ఎన్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగర్ సాహిన్, ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, ఈ వ్యాక్సిన్ కనీసం ఏడాది పాటు వైరస్ ను నియంత్రిస్తుందని, ఈ విషయంలో కొన్ని అనుమానాలను కాలమే నివృత్తి చేస్తుందని అన్నారు. తమ వ్యాక్సిన్ పనితీరుపై వెల్లడైన సమాచారాన్ని విన్న తరువాత ఎంతో సంతోషం కలిగిందని, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని ఆయన అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/