కరోనా వ్యాక్సిన్‌కు రెండున్నరేళ్లే పడుతుంది

ప్రస్తుతం కరోనాను తగ్గించే చికిత్స లేదు.. డాక్టర్‌ డేవిడ్‌ నబారో

David Nabarro

జెనీవా: కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు పలు దేశాలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఈక్రమంలోనే ప్రపంచ జనాభాకు సరిపడే వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలంటే రెండున్నర ఏళ్లు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ డేవిడ్‌ నబారో తెలిపారు. ప్రపంచంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, కేసులు అధికంగా ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నబారో చెప్పారు. అందుకే ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా బారిన పడకుండా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కరోనాను నయం చేసే చికిత్స లేదని, ఏ దేశమైనా ఉందని చెప్పుకుంటే దానికి పూర్తి ఆధారాలు చూపించాలని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ కరోనా సోకకుండా రోగ నిరోధక శక్తి అడ్డుకోగలదా? అన్న విషయం కూడా ఇంకా తేలలేదని తెలిపారు.

ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినప్పటికీ దాన్ని తీసుకున్న వ్యక్తి కరోనా నుండి పూర్తిగా రక్షించబడతాడా? అన్న విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుందన్నారు. అంతేగాక, ఈ విషయంలో నిరూపించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. ప్రజల అలవాట్లను మార్చుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్‌19 చాలా ప్రమాదకర వైరస్‌ అని చెప్పారు.ప్రపంచంలో ఇంకా లక్షలాది మంది కరోనా‌ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. అలవాట్లను మార్చుకుంటే కరోనా వైరస్‌తో కలిసి జీవించగలమని, నబారో చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/