ఏపిలో పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం..

Pensions from tomorrow Revised guidelines to be issued over disbursal of pensions

అమరావతిః పెన్షన్ పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఏపీలో పెన్షన్ పంపిణీ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. టిడిపి, జనసేన, బిజెపి నేతల వల్లే సకాలంలో పెన్షన్లు అందించలేకపోయామని ఆరోపించింది. తాజాగా పెన్షన్ల పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పెన్షన్ పంపిణీకి అనుసరించాల్సిన విధానాలపై వారితో చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని, ఎండల తీవ్రత నేపథ్యంలో అక్కడ టెంట్లు, తాగునీరు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

వలంటీర్ల సేవలకు ఎన్నికల కమిషన్ బ్రేక్‌ వేయడంతో పెన్షన్ పంపిణీ రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత రాజకీయమంతా పెన్షన్ల చుట్టూ తిరుగుతోంది. ప్రతిపక్షాల వల్లే పెన్షన్లు అందించడం ఆలస్యం అవుతోందని వైఎస్‌ఆర్‌సిపి సర్కారు ఆరోపించింది. వలంటీర్లను తప్పించేందుకు కారణమైన టిడిపి, జనసేన పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని వైఎస్‌ఆర్‌సిపి ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే వలంటీర్లను సొంత ప్రయోజనాలకు వాడుకోవడం వల్లే ఈసీ వేటు వేసిందని టిడిపి, జనసేన, బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.

అసలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉన్నప్పుడు కదా పంపిణీ గురించి ఆలోచించేదని విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఖజనా మొత్తం ఖాళీ చేసి పెన్షన్లు ఇవ్వలేక, తప్పించుకోవడానికి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని అంటున్నారు. కాగా, వలంటీర్ల వ్యవస్థను గతంలో విచ్చిన్నం చేయాలన్న పార్టీలే ఇప్పుడు ప్రశంసిస్తూ మాట్లాడుతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించగా.. ఒక్కరోజులో పెన్షన్లు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం ఉన్నది దేనికంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ నిలదీస్తున్నారు.