ముగిసిన చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ల సమావేశం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన సమావేశం ముగిసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ ఫై చంద్రబాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి , రాజకీయ అంశాల గురించి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉండగా.. చంద్రబాబు వెంట ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు ఆరోగ్యం , చంద్రబాబు ఫై పెడుతున్న కేసులతో పాటు రాబోయే రోజుల్లో జనసేన – టీడీపీ కలిసి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు ఏవిధంగా చేయాలి..? బీజేపీ పార్టీతో భవిష్యత్‌లో ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ- జనసేన పార్టీలు చూస్తున్నాయి.