చిరంజీవి బర్త్ డే..భగవంతుడికి థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి 68 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఉదయం నుండే మెగా ఫ్యాన్స్ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ , కేకులు కట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోపక్క సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చిరంజీవి కి సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , బిజినెస్, క్రీడా కారులు బెస్ట్ విషెష్ అందజేస్తున్నారు. ఇదే తరుణంలో తమ్ముడు పవన్ కళ్యాణ్..అన్నయ్య చిరంజీవి కి ఓ రోజు ముందే తన బెస్ట్ విషెష్ అందజేశారు.

‘అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం.

కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా… కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య’ అంటూ ట్వీట్ చేశారు.