అచ్యుతాపురం ప్రమాద ఘటన ఫై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్‌ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాహితీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతికి తన సంతాపాన్ని తెలియచేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.

ఇంకెన్నాళ్లు ఇలా కెమికల్ కంపెనీస్ లో ప్రమాదాలు జరుగుతుంటాయి… ప్రభుత్వం ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రెండు రియాక్టర్లలో పేలుడు సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాల్వెంట్ ను ఒక లారీలోకి ఎక్కిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.

ఈ సాల్వెంట్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. మంటలు అదుపులోకి రాకపోవడానికి అదే కారణం అని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ దగ్గరికి వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగింది? అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏడుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..ప్రస్తుతం వారాహి విజయ యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. నేడు భీమవరం లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.