సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కి రాజీనామా చేయగా..తాజాగా సూర్యాపేట జిల్లాలో మరో షాక్ ఎదురైంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల శామ్యూల్ రాజీనామా చేశారు. గతంలో ఆయన తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు.

బీఆర్ఎస్ లో మాదిగలకు తగిన గుర్తింపు లేదని , మాదిగలకు అవమానం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. మాదిగలు లేని కేబినెట్ తెలంగాణలోనే ఉందని అన్నారు. ఎవరి కోసం తెలంగాణ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మందికి దళిత బంధు ఇచ్చారని శామ్యూల్ నిలదీశారు. ఈ ప్రభుత్వ పాలనలో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింటోందని చెప్పారు. తెలంగాణను సాధించుకున్నప్పటికీ మాదిగల జీవితంలో మార్పులేదని అన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్టే అవకాశం తమకు ఉండడం లేదని అన్నారు. మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదని తెలిపారు.