నేడే తెలంగాణ లో గ్రూప్ – 4 పరీక్ష

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ – 4 పరీక్ష కు సర్వం సిద్ధం చేసారు. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాయనున్న గ్రూప్-ఫోర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది. పరీక్షకు అభ్యర్థులు బూట్లు ధరించి వస్తే అనుమతించబోమని, చెప్పులు వేసుకొని రావాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

హాల్‌టికెట్‌తోపాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు చూపించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. హాల్‌టికెట్‌పై ఫోటో లేకపోతే.. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న మూడు ఫోటోలతో రావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్ వంటి వాటికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోని పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని వివరించింది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కమిషన్‌ పేర్కొన్నది. 8,039 గ్రూప్‌4 ఉద్యోగాలకు 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నట్టు తెలిపింది.