రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యం – పవన్ కళ్యాణ్

రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అన్ని సర్వేలు వైసీపీ పార్టీ ఓడిపోతుందని చెపుతున్నాయని , అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు పవన్.

‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అదే రీతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారింది. జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు.. దిగజారిన విమర్శలు చేస్తోంది వైసీపీ. అసభ్యకర దూషణలకి దిగి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నాం.

అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీ కి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా- నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి… పార్టీని బలహీనపరచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు. వాటిని నేను సహృదయంతో అర్థం చేసుకోగలను. వారి దూషణలను నేను దీవెనలుగా తీసుకొంటాను అని పవన్ తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసింది. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. జనసేనపైనా, నాపైనా సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు కచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని నేను బలంగా విశ్వసిస్తాను. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – తెలుగు దేశం పొత్తుకి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.