మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి..సీఎం

అమరావతి: సీఎం జగన్ మహిళల భద్రతపై ఈరోజు అధికారులతో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. యాప్‌ ఎలా వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కలిగించాలి. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ముందుగా మహిళా పోలీసులకు, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు అవగాహన కలిగించాలి. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్న దానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలి. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలి.

కాలేజీలు, విద్యాసంస్థల్లో కూడా విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కలిగించాలి. ఈ చర్యల వల్ల దిశ యాప్‌ వినియోగం పెరుగుతుంది. అక్క చెల్లెమ్మలను ఆదుకునేలా ఆ మేరకు వెనువెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీస్‌స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలి. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలి’ అని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/