జనసైనికుల దాడి పట్ల పవన్ సమాధానం చెప్పాల్సిందే – మంత్రి అంబటి

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న టీటీడీ చైర్మ‌న్‌, వైస్సార్సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు క‌ర్ర‌లు, రాళ్లతో దాడికి తెగబడ్డారు, ఈ దాడిలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. తనపై దాడి జరిగిందని, జనసేన కార్యకర్తల దాడిలో తమ వాళ్లకు గాయాలయ్యాయని మంత్రి జోగి రమేష్‌ తెలిపారు.

ఈ దాడి పట్ల వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ‌న‌సైనికుల దాడిని మంత్రి అంబ‌టి రాంబాబు తీవ్రంగా ఖండించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నాయ‌కుల‌పై జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అంబ‌టి రాంబాబు డిమాండు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ దాడి పట్ల పవన్ కళ్యాణ్ బాధ్య‌త వ‌హిస్తూ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ డిమాండు చేశారు.

మంత్రుల కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ‌టం దుర్మార్గ‌మ‌న్నారు. వారు జన సైనికులు కాదు.. జన సైకోల‌ని మండిప‌డ్డారు. మంత్రి జోగి రమేష్, సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి కార్లపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ‌టాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుశ్చ‌ర్య‌లు మంచివి కావ‌ని హిత‌వు ప‌లికారు. విశాఖ‌ గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులకు తెగ‌బ‌డుతోంద‌ని ప్రభుత్వ విప్ క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మండిప‌డ్డారు. పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా..? జ‌న‌సేన‌కు వందమంది కార్య‌క‌ర్త‌లు ఉంటే.. మాకు 10 వేల మంది ఉన్నార‌ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చ‌రించారు. ఇలాంటి దాడులు స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు.