పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే వైస్సార్సీపీ ఈ నాటకాలు ఆడుతుంది : నాదెండ్ల మనోహర్‌

వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభను ముగించుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న టీటీడీ చైర్మ‌న్‌, వైస్సార్సీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు క‌ర్ర‌లు, రాళ్లతో దాడికి తెగబడ్డారని వస్తున్న వార్తలను జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ఖండించారు.

విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగానీ, అది జనసేన వాళ్ళు చేసినట్లుగానీ పోలీస్ శాఖ నిర్ధారించలేదు. కేవలం వైస్సార్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమే ఇది. దాడి సంస్కృతి మా పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదు. ఆ విద్యలో వైస్సార్సీపీ వాళ్ళు ఆరితేరిపోయారు. విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు కోడి కత్తి హడావిడి చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదు.

అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. మంత్రుల మీదే దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు భారీ జన సందోహం వచ్చింది… రేపటి జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లించేందుకే వైస్సార్సీపీ కొత్త నాటకానికి తెర తీసింది. విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసు? మంత్రుల కాకమ్మ కథలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తగినంత బందోబస్తు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి లేఖ రాశాం. అదే విధంగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కు మా పార్టీ నేతలు లేఖ ఇచ్చారు. అయినా తగిన విధంగా స్పందించలేదు. నామ మాత్రంగానే పోలీసు సిబ్బందిని కేటాయించడం వెనక అధికారులపై ఒత్తిడి ఉన్న విషయం అర్థమవుతోంది. అదే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా వస్తుంటే వీధి దీపాలు వెలగకుండా పవర్ కట్ చేశారు అంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రజలు గ్రహించాలి.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు.