ఢిల్లీలో వాయు కాలుష్యం పై నేడు సీఎం కేజ్రీవాల్‌ ఉన్నతస్థాయి సమావేశం

CM Kejriwal calls high-level meeting Delhi amid rising pollution levels in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వరుసగా నాలుగో రోజూ వాయు నాణ్యత పడిపోయింది. సోమవారం ఉదయం 9 గంటలకు వాయు నాణ్యతా సూచి 437గా ఉందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రకటించింది. అయితే గత మూడు రోజులతో పోల్చితే ఇది కాస్త తగ్గింది. కాగా, వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌తోపాటు రవాణా శాఖ, ఢిల్లీ మున్సిపాలిటీ, పోలీస్‌, ఇతర శాఖలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన స్టేజ్‌-4 గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌ అమలుపై చర్చించనున్నారు.

కాగా, కేజ్రీవాల్‌ ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిందనే విపక్షాల విమర్శలకు అధికార ఆప్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక కక్కర్‌ స్పందించారు. సీఏక్యూఎం ప్రకారం పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాలు 50 నుంచి 67 శాతం తగ్గాయని చెప్పారు. పంజాబ్‌లో పంట కాల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలు ఢిల్లీకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, కానీ.. హర్యానాలోని ప్రాంతాలు మాత్రం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని వెల్లడించారు. పంజాబ్‌లోని తమ ప్రభుత్వం పంట వ్యర్థాల కాల్చివేతను విజయవంతంగా అరికడుతుండగా, హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం విఫలమైందని విమర్శించారు.