వైసీపీ మంత్రులపై నిప్పులు చెరిగిన పవన్

ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దూకుడు ను కనపరుస్తున్నారు. ఈసారి జగన్ ను గద్దె దించడమే లక్ష్యం గా పెట్టుకున్న పవన్..అదే రీతిలో విమర్శలు సంధిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మంగళవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో వారాహి విజయభేరి సభ లో పాల్గొన్నారు. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని , పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు.రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ముందుకు కదిలింది అంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని పేర్కొన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50 శాతం పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని పోలవరం పరిస్థితిపై అడిగితే నాకేం తెలుసు అంటాడు… అందుకా నీకు మంత్రి పదవి ఇచ్చింది? డ్యాన్స్ లు వేసుకోవడానికా? అంటూ మండిపడ్డారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అనిల్ కుమార్ ను పోలవరం గురించి అడిగితే వెటకారంగా మాట్లాడతాడు… ఈ బఫూన్ రాంబాబును అడిగితే ఇంకో రకంగా సమాధానం చెబుతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.