వైస్సార్సీపీ పార్టీ కోటలు బద్దలు కొడతాం – పవన్ కళ్యాణ్

వైస్సార్సీపీ పార్టీ కోటలు బద్దలు కొడతామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలోని కొంతమంది ఇళ్లను కూల్చేసిన సంగతి తెలిసిందే. జనసేన మీటింగ్ కు ఇప్పటం గ్రామస్థులు స్థలం ఇచ్చారనే కోపంతోనే వారి ఇళ్లను కూల్చేశారని జనసేన ఆరోపిస్తూ..ఇల్లు కోల్పోయిన వారికీ లక్ష రూపాయిలు ఇస్తున్నట్లు ప్రకటించిన పవన్..ఈరోజు వారికీ చెక్కులు అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వైస్సార్సీపీ ఫై నిప్పులు చెరిగారు. నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటానని ప్రకటించారు. నష్ట పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించిందన్నారు. వైస్సార్సీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. కూల్చివేతలో పద్ధతి పాటించలేదు. అంతా కక్షతో చేశారన్నారు. జనసేన పార్టీకి స్థలం ఇచ్చారని ఒకే ఒక కారణంతో ఇప్పటంలో ఇలాంటి పూజ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇప్పటం ప్రజలు భయపడ వద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్.. అమరావతి రైతులు ఇదే తెగువ చూపితే రాజధాని తరలిపోయేదికాదని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల ఇళ్లు, భూములను తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమని, ఈ విషయం తనను బాధిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు.