తుని రైలు దహనం వెనుక వైసీపీ హస్తం – పవన్ కీలక ఆరోపణలు

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వైసీపీ ఫై కీలక ఆరోపణలు చేసారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైసీపీ నేతలు కాపు యువతని ఎగదోశారని , సీఎం జగన్​ కిరాయి మూకల్ని పెట్టి రైలుని తగలబెట్టించారని కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్‌కల్యాణ్‌ కీలక ఆరోపణలు చేసారు.

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండడం తో రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా విమర్శలు , ఆరోపణలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఆదివారం రాత్రి జగ్గంపేటలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌..వైసీపీ సర్కార్‌ ఒక అరటి పండు తొక్క ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. పోలవరం కాల్వల మట్టిని వైసీపీ నాయకులు దోచేస్తున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. కాల్వ గట్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా జలవనరులశాఖ ఏం చేయలేకపోతోందని ఆరోపించారు.

తుని రైలు దహనం వైసీపీ కుట్రేనని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైసీపీ నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్​ కిరాయి మూకల్ని పెట్టి రైలుని తగలబెట్టించారని ఆరోపించారు. అదే సమయంలో కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి ఉంటే తానెందుకు ఓడిపోతానని ప్రశ్నించారు.