జులై మూడో వారం నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

parliament-budget

హైదరాబాద్‌ః పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జులై 17 లేదా 20వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 10న ముగియవచ్చని తెలిపాయి. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరుగుతాయా? లేక ప్రస్తుతం ఉన్న భవనంలోనే కొనసాగుతాయా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల రోజులక్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే.. పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సమావేశాల్లో ఢిల్లీపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది.