నేడే ఏఐసీసీ ఎన్నికల ఫలితాలు..

సోమవారం జరిగిన ఏఐసీసీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు కౌంటింగ్ జరుగుతుంది. ఉదయం 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఫలితాల ప్రకటన రానున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లిఖార్జున ఖర్గే , శశిథరూర్ పోటీపడ్డారు. వీరిద్దరిలో ఖర్గే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ పెద్దల మద్దతు ఆయనకే ఉందని.. ఇటీవల పలు సందర్భాల్లో శశిథరూరే చెప్పారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గేనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం ఓటర్లు ( పిసిసి డెలిగేట్లు) సంఖ్య 9,937 కాగా, ఓటు వేసిన మొత్తం “పిసిసి డెలిగేట్ల” సంఖ్య 9,477 గా ఉంది. మొత్తం 38 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిన్న ఉదయం వరకు ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాయి మొత్తం 68 “బ్యాలట్ బాక్సులు”. అన్ని “బ్యాలట్ బాక్సులు” లో ఉన్న మొత్తం ఓట్లను కలిపిన తర్వాత, ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

ఇరువురు అభ్యర్ధులకు వచ్చిన ఓట్లను విడివిడిగా, “బ్యాలట్ పేపర్లు”ను చిన్న, చిన్న కట్టలుగా కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కట్టలో 25 “బ్యాలట్ పేపర్లు”, ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోలైన 9,477 ఓట్లలో సగాని కంటే ఎక్కువుగా ఒక్క ఓటు వచ్చిన ( అంటే 4740 ఓట్లు) అభ్యర్ది విజయం సాధించినట్లుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ వర్గాల నుంచి ఐదు మంది చొప్పున ఏజెంట్లు కౌంటింగ్‌ను పర్యవేక్షిస్తారు. రెండు వర్గాల నుంచి మరో ఇద్దరు ఏజెంట్లను రిజర్వ్‌లో ఉంచుతారు. వీరితో పాటు ఇరువురు నేతల మద్దతుదారులు కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భారీగా చేరుకోనున్నారు.

137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరొవసారి. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంతకు ముందు 1939, 1950, 1977, 1997, 2000 సంవత్సరాల్లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ఈసారి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గాంధీయేతర కాంగ్రెస్ నేతలే పోటీపడ్డారు. అందువల్ల 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబేతర నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టబోతున్నారు. ఇంతకు ముందు సీతారాం కేసరి గాంధీయేతర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.