బిజెపి అధికార ప్రతినిధిలా గవర్నర్ మాట్లాడుతున్నారుః హరీశ్ రావు

ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని చూస్తే ఆందోళన కలుగుతోందన్న తమిళిసై

harish-rao-comments-on-tamilisai

హైదరాబాద్‌ః ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి దుస్థితిని చూస్తే ఆందోళన కలుగుతోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ… తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా ఏనాడైనా ఆమె చెప్పారా? అని ప్రశ్నించారు.

ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలని సిఎం కెసిఆర్‌ 2015లోనే నిర్ణయం తీసుకున్నారని హరీశ్ చెప్పారు. కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని… అయితే ఈ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. గవర్నర్ వ్యాఖ్యల్లో రాజకీయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిజెపి అధికార ప్రతినిధిలా గవర్నర్ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు.