సైనికుల త్యాగాల‌ను వృధా పోన్వివం..భదౌరియా

IAF Chief RKS Bhadauria

హైదరాబాద్‌: దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు భార‌త వాయుసేన చీఫ్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..మ‌న భూభాగాన్ని ర‌క్షించుకునేందుకు గాల్వ‌న్ లోయ‌లో మ‌న సైనికులు అత్యంత సాహాసాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు చెప్పారు. అమ‌రులైన క‌ల్న‌ల్ సంతోష్ బాబు, ఇత‌ర సైనికులకు నివాళి అర్పించారు. గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన సైనికుల త్యాగాల‌ను వృధా పోనివ్వ‌మ‌ని, స‌రైన స‌మ‌యంలో స‌రైన బదులిస్తామ‌ని దేశ ప్ర‌జ‌ల‌కు భ‌దౌరియా హామీ ఇచ్చారు. సైనిక చ‌ర్చ‌ల్లో కుదుర్చుకున్న ఒప్పందాల‌ను చైనా సైనికులు ఉల్లంఘించార‌ని, ఆ దేశ చ‌ర్య వ‌ల్ల మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు. వాస్త‌వాధీన రేఖ వెంట ప్ర‌స్థుత ప‌రిస్థితిని శాంతియుతంగానే ప‌రిష్క‌రించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వాయుసేన చీఫ్ తెలిపారు. దేశ భ‌ద్ర‌తా దృష్ట్యా.. మ‌న త్రివిధ‌దళాలు నిత్యం అప్ర‌మ‌త్తంగానే ఉన్నాయ‌న్నారు. ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. అది మ‌న‌ల్ని నిత్యం అప్ర‌మ‌త్తుల్ని చేస్తుంద‌న్నారు. ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితి ఎదురైనా.. దాన్ని ఎదుర్కొనేందుకు తాము ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉన్న‌ట్లు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/