ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా చేయనున్న పాకిస్థాన్?

ప్రతిఫలంగా ఎంఐ 17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేయనున్న ఉక్రెయిన్ కంపెనీ

Pakistan to supply ammunition to Ukraine; likely to get Mi-17 chopper upgrades in return

ఇస్లామాబాద్‌ః రష్యాతో ఒంటరిగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు పాకిస్థాన్ ఆయుధ సాయం చేయనుందని ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ రష్యాల మధ్య బంధం పెరుగుతుండడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాయి. చాలా దేశాలు ఈ ఆంక్షలను అమలుచేయగా.. భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలును తగ్గించకుండా రష్యాకు అండగా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయాలని నిర్ణయం తీసుకుందట. సముద్ర మార్గం గుండా ఆయుధాలను పంపించాలని పాక్ నిర్ణయించుకుందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. ప్రతిగా తమ మిలటరీలోని ఎంఐ-17 హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఉక్రెయిన్ కంపెనీ నుంచి సాయం పొందాలని పాక్ పాలకులు భావిస్తున్నట్లు పేర్కొంది.

మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, మందుగుండు సామగ్రి.. తదితర ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపించేందుకు పాక్ ఏర్పాట్లు చేస్తోందని ఎకనమిక్ టైమ్స్ తెలిపింది. ఉక్రెయిన్ పక్కనే ఉన్న యురోపియన్ యూనియన్ దేశానికి ఈ ఆయుధాలను చేర్చనుందని పేర్కొంది. దీనికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ కు చెందిన యుద్ధ విమానాల ఇంజన్ల తయారీ కంపెనీ పాకిస్థాన్ దగ్గరున్న హెలికాఫ్టర్లను అప్ గ్రేడ్ చేయడానికి సాయం చేస్తుందని వివరించింది.

ఉక్రెయిన్ పాక్ ల మధ్య చాలాకాలంగా మిలటరీ, వాణిజ్య అంశాల్లో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. 1991 నుంచి 2020 వరకు సుమారు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను ఉక్రెయిన్ నుంచి పాక్ కొనుగోలు చేసింది. ఇందులో ఉక్రెయిన్ తయారుచేసిన టి-80 యూడీ యుద్ధ ట్యాంకులు 320 కి పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలు మొత్తం ఉక్రెయిన్ చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/