భారత్‌ క్రికెట్‌ జట్టుపై ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసలు

ప్రపంచంలో మేటి క్రికెట్ జట్టుగా భార‌త్ ఎదుగుతోంది

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌ క్రికెట్‌ జట్టుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. భార‌త జ‌ట్టు ప్ర‌ణాళిక, క్రికెట్‌లో సాధిస్తోన్న విజ‌యాల గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ త‌మ జ‌ట్టుకు కూడా ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో భార‌త్‌ను చూస్తే ప్రపంచంలోనే గొప్ప‌ జట్టుగా ఎదుగుతోందని, సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతుంద‌ని చెప్పారు.

పాక్‌లోనూ మంచి నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారని తెలిపారు. అయితే, మంచి ప్రణాళికతో ముందుకెళ్లడంతో పాటు అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి పాక్ జ‌ట్టుకు సమయం పడుతుందన్నారు. పాకిస్థాన్‌ కూడా ఓ రోజు క్రికెట్‌లో అగ్ర‌స్థానంలో నిలుస్తుందన్న నమ్మకం త‌న‌కు ఉంద‌ని చెప్పారు. పాక్‌ క్రికెట్‌ ప్రణాళికలు మారాయ‌ని, భ‌విష్య‌త్తులో జ‌ట్టు మెరుగవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత కాలంలో క్రికెట్‌ చూడటానికి కూడా త‌న‌కు సమయం దొరకడం లేదని చెప్పుకొచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/