తరగతుల ప్రారంభంతోనే విద్యాసంస్థల దోపిడీ షురూ

ట్యూషన్ల ఫీజుల వేట

అసలే కరోనా కాలం. ఆపై పని దొరకని సమయం. ఎలాగో అలాగా కుటుంబాలను నెట్టుకొస్తున్న పేదవర్గాలు, చూసి చూసి ఖర్చుపెడుతున్న మధ్యతరగతి వర్గాలు. ఇప్పుడిప్పుడే పని దొరుకు తుంది.మెల్లమెల్లగా ఆదాయమార్గాలు తెరుచుకుంటున్నాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. 9వ, 10వ తరగతులు ఆపై తరగతులు మొదలైనాయి. ఆన్‌లైన్‌ లో పాఠాలు అర్థమై, అర్థంకాక విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో మిగిటఊలిన కాలం కేవలం మూడున్నర నెలలే. సరిగ్గా ఇప్పుడే ప్రైవేట్‌ విద్యాసంస్థలకు బంగారు బాతు దొరికినట్లయింది.

సంవత్సరానికి వసూలు చేసే ఫీజులు కేవలం మూడున్నర నెలలకే చెల్లించాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే మేము ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పలేదా? భవనా లకు రెంట్లు చెల్లించలేదా? మీకు అకాడమిక్‌ ఇయర్‌పూర్తికావడం లేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం 30 శాతం సిలబస్‌ తగ్గిస్తే, ప్రైవేట్‌ విద్యాసంస్థలు మాత్రం వందలశాతం ఫీజు అంటే సంవత్సరానికి కట్టే ఫీజు మూడున్నర నెలలకే కట్టమంటున్నారు. దిక్కుతోచని తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితులలో అప్పుతెచ్చి మరీ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం మాత్రం జీవోలు జారీచేశాం,

పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పినా దోపిడీ మాత్రం యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. కేవలం రెండవ తరగతి విద్యా ర్థికి అది మామూలు ఒకప్రైవేట్‌ పాఠశాల వారు కేవలం ట్యూషన్‌ ఫీజుగా 21వే రూపాయలు చెల్లించమని డిమాండ్‌ చేస్తున్నారు. పోనీ ఆన్‌లైన్‌ క్లాసులైనా జరిగాయంటే రెండో తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులలో వారు ఏమి చెప్పినట్లు?పిల్లలు ఏమి విన్నట్లు? ఐదవ తరగతికి కేవలం ట్యూషన్‌ ఫీజుగా 30వేల రూపాయలు ఫిక్స్‌చేశారు.

చెప్పేది ఆన్‌లైన్‌ క్లాసులే కదా, అందులో 30 శాతం సిలబస్‌ తగ్గించారుగా అంటే ఇష్టం ఉంటే వినండి లేకుంటే విన కండి అని గదిరింపులు.పాఠశాలల ట్యూషన్‌ ఫీజులు ప్రభుత్వం నెలనెల కట్టమంటే లేదు రెండు లేదా మూడు విడతల్లోనే కట్టా ల్సిందే అని విద్యార్థులను ఆన్‌లైన్‌ క్లాసులోనే హెచ్చరిస్తున్నారు. సమయానికి కట్టకపోతే ఆన్‌లైన్‌ క్లాస్‌ లింక్‌ కట్‌ చేస్తున్నారు. 9వ, 10వ తరగతి విద్యార్థులు మూడు న్నర నెలలకే మారు మాట్లాడకుండా మొత్తం ఫీజు చెల్లిం చాల్సిందే. ఎవరైనా ఎందుకు అన్ని అడి గితే టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదా అని తిరిగి ప్రశ్నిస్తారు.

అంటే ఇస్తున్న జీతాలు 50 నుంచి 25శాతం వరకు.కానీ వసూలు చేస్తున్న ఫీజు వందశాతం. పోనీ ఇతర పాఠశాలలకు వెళ్దామంటే టీసి ఇవ్వరు. అయిన 8వ తరగతి వరకు టీసి అవసరం లేదుగా అని వేరే పాఠశాలకు వెళ్తే పాత పాఠశాలలో విద్యార్థి పేరు చైల్డ్‌ ఇన్ఫోలో తొలగించరు. ఆ విద్యార్థి పేరు కొత్తపాఠశాలల్లో నమోదు కావడం లేదు. చైల్డ్‌ ఇన్ఫోలో పేరు తొలగించాలంటే పాత పాఠశాలకు ఫీజు కట్టా ల్సిందే. ఇక కళాశాలల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రైవేట్‌ కళాశాలలో చేరిన విద్యార్థులు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే. ముఖ్యంగా ఇంటర్‌రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం సంవత్సర ఫీజు కట్టాల్సివచ్చింది. కానీ ఓ మోస్తరు పెద్ద పాఠశాలలు, కళాశాలల్లో మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరోనా కాలంలో అన్ని వర్గాలకు చివరకు ప్రభుత్వాలకు సైతం ఆదాయం తగ్గి కష్టాలు, నష్టాలపాలైతే, విద్య,వైద్య సంస్థలు మాత్రం నష్టాలుకాదు సరికదా లాభాల బాటలో ప్రయాణిస్తున్నా యి. ఉపాధ్యాయులను తొలగించడం, ఉన్నవారికి జీతాలు తగ్గిం చడం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో చరవ్యయాలు పూర్తిగా తగ్గిపోయాయి.

కానీ ఫీజులు మాత్రం మొత్తం వసూలుచేస్తూ ఎడారిలో పంటలు పండించినట్లు కరోనా కాలంలో లాభాలు గడిస్తున్నారు. ఒకపక్క గత కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తూ ఆ విద్యాసంస్థనే నమ్ముకుని ఉన్న ఉపాధ్యాయులను, వర్కర్లను, డ్రైవర్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ లేదా జీతాలు తగ్గిస్తూ మరోపక్క విద్యార్థుల నుంచి మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నారు. మార్కెట్లో కూరగాయల బేరం వలే ఒకరికి ఒక లెక్క, మరొకరికి మరో లెక్క. ఫీజులకంటూ ప్రామాణిక విధానమే లేదు. దానికితోడు మెటీరియల్‌ అని వగైరా వగైరా అమ్మకాలుజరిపి ఒక పెద్ద బుక్‌స్టోర్‌నే నడిపిస్తున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తే మా మెటీరియల్‌నే చదవాలని ఒత్తిడి చేస్తున్నారు. విద్యారంగం అంటే లాభాల కోసం కాదని సమాజ సేవ కోసం అని అనేవాళ్లు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అత్యంతలాభాలు గడించేరంగంగా మార్చివేశారు.

ఒకప్పుడు మనిషికి కనీస అవసరాలు కూడు, గుడ్డ, నీడ అనే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కనీస అవసరాలు విద్య,వైద్యం. కనీస అవసరాల వ్యాపారం మార్కెట్లో కాసులు కురిపిస్తుంది. అభివృద్ధి అంటే అందమైన రోడ్లు, పెద్దపెద్ద భవనాలు, పెద్ద పారిశ్రామిక సంస్థలు, విదేశీ పెట్టుబడులు మాత్రమే కాదనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజలకు కావలసిన కనీస అవసరాలైన విద్య,వైద్యం ఉచితంగా అందించడం కాదు. నాణ్యంగా ఉండాలి. నాణ్యమైన విద్య,వైద్యమే భవిష్యత్తుపెట్టుబడి అని అందరు గ్రహిస్తే, అదే భవిష్యత్తులో నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుంది.

  • జుర్రు నారాయణ యాదవ్‌