పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ రూ. 272 , కేజీ చికెన్ రూ.780

పాకిస్తాన్ తీవ్ర ఆర్దిక సంక్షోభం ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలు, రాజకీయ అస్థిరత, జీడీపీలో భారీ క్షీణతతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు 272 రూపాయలకు చేరుకుంది. దేశ కరెన్సీ విలువ క్షీణించడం మరియు కీలకమైన బెయిలౌట్ నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో చర్చలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ అనేక దశాబ్దాల తర్వాత గరిష్ఠ ద్రవ్యోల్బణాన్ని 27% ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి.

పెట్రోల్‌తో పాటూ డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు చేరుకుంది. లీటర్ కిరోసిన్ ధర రూ.202.70కు చేరుకుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాక్‌కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి..ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

అలాగే కరాచీలో దుకాణదారులు పాల ధరలను లీటరు రూ.190 నుంచి రూ.210కి పెంచారు. లూజ్ మిల్క్, పాకెట్ పాలు అన్నింటి ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. బ్రాయిలర్ చికెన్ గత రెండు రోజుల్లో కిలో రూ.30-40 పెరగడంతో ధర రూ.480-500కి చేరుకుంది. ఈ నెల ప్రారంభంలో, లైవ్ పక్షి కిలో ధర రూ. 390-440ని తాకింది. కొన్ని రోజుల క్రితం కిలో రూ.620-650గా ఉన్న కోడి మాంసం ఇప్పుడు రూ.700-780కి విక్రయిస్తున్నట్లు డాన్ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ లో ఎముకలు లేని మాంసం ధర కిలోకు రూ. 1,000-1,100 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో తొలుత తన ఇంటిని చక్కబెట్టుకోవాలని అంతర్జాతీయ నిపుణులు సలహా ఇస్తున్నారు.