హనుమాన్ శోభాయాత్ర సందర్బంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్‌ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ ఆలయం వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ఉండేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు జరిగే అన్ని రూట్లలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ చంపాపేట్ క్రాస్‌రోడ్స్, మలక్‌పేట్ ఏసీపీ కార్యాలయం, సరూర్‌నగర్ పోస్టాఫీస్, కొత్తపేట్ జంక్షన్, దిల్‌సుఖ్‌నగర్, నల్లగొండ క్రాస్‌రోడ్స్, కోఠి, కాచిగూడ క్రాస్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్ జంక్షన్, కవాడిగూడ క్రాస్‌రోడ్స్, బైబిల్ హౌస్, బాటా, మహంకాళి ఆలయం, సీటీఓ జంక్షన్, బ్రూక్‌బాండ్ క్రాస్‌రోడ్స్, మస్తాన్ కేఫ్ నుంచి తాడ్‌బంద్ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుంది.
మరోపక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నేడు చిన్న జయంతి సందర్భంగా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది దీక్షాపరులు, భక్తులు చేరుకుంటున్నారు. గుట్ట కింది నుంచి పురాతన మెట్ల దారి, ఘాట్ రోడ్డు, నాచుపల్లి గ్రామాల మీ దుగా అంజన్న సన్నిధానానికి వస్తున్నారు. కాగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత భక్తులు మాల విరమణకు పోటెత్తారు.