పాకిస్థాన్​లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్..మొబైల్‌ సేవలపై ఆంక్షలు

Pakistan Elections..Voting to elect new government underway, mobile phone services suspended

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. జాతీయ అసెంబ్లీకి 5,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 4,807 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరగడానికి దేశవ్యాప్తంగా 6 లక్షల 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు గుమికూడారు. మొత్తం 12.85 కోట్ల మందికిపైగా ఓటు వేయనున్నారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో దేశంలో మొబైల్‌ సేవలను నిలిపివేశారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది.

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌, ఇటీవలే లండన్‌ నుంచి వచ్చిన మరో మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) పార్టీ నేత నవాజ్‌ షరీఫ్‌ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నారు. తన పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్‌ బ్యాట్‌ను ఎన్నికల సంఘం తొలగించడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. అయితే సైన్యం మద్దతు పుష్కలంగా ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే 74 ఏండ్ల షరీఫ్‌ రికార్డు స్థాయిలో నాలుగోసారి పాక్‌ ప్రధానిగా కానున్నారు.