5 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు

న్యూఢిల్లీ: కేరళ, పశ్చిమబెంగాల్‌ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. నేడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది. పలు దఫాలుగా ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రాల్లో పర్యటించి, సమీక్షించింది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో ఖాళీగా ఉంది. అలాగే ఏపిలోని తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి సైతం షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీ చేసి గెలుపొందిన దుర్గా ప్రసాద్‌ గతేడాది సెప్టెంబర్‌లో కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. ఐదు రాష్ట్రాలకు నిర్వహించే ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


కాగా, అసోంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విశ్వాస పరీక్షకు ముందు వి.నారాయణ స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రాజీనామా చేయడంతో పాండిచ్చేరి అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/