రహదారులపై టీఆర్‌ఎస్‌ రాస్తారోకో

హైదరాబాద్: తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా నేడు జాతీయ రహదారులపై రాస్తారోకోలకు టీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయనుంది. వరి ధాన్యం కొనుగోళ్లలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సంగారెడ్డి, నిర్మల్, సూర్యాపేట, భూత్పూర్‌లోని నాలుగు జాతీయ రహదారులపై రాస్తారోకో చేపట్టనున్నారు. నాగపూర్‌, బెంగళూరు, విజయవాడ, ముంబై హైవేలపై రాస్తారోకోలు చేపట్టనుంది. ఆయా జాతీయ రహదారులు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని, రాష్ట్ర రైతాంగం పక్షాన టీఆర్‌ఎస్‌ ధర్మాగ్రహాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌ జంక్షన్‌ వద్ద ఇంద్రకరణ్‌రెడ్డి పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/