ఏప్రిల్ 28 న వరంగల్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ..హాజరు కానున్న రాహుల్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటేందుకు సిద్దమవుతుంది. సోమవారం ఢిల్లీ లో రాహుల్ గాంధీ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయినా సంగతి తెలిసిందే. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో అనేక విషయాల ఫై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 వ తేదీన వరంగల్‌ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రాహుల్‌ గాంధీ హాజరు కానున్నట్లు సమాచారం.

తెలంగాణ లో రాహుల్‌ గాంధీ పర్యటించక చాలా కాలం అవుతోంది. అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్‌ గా రేవంత్‌ రెడ్డి నియామకం అయ్యాక.. పలుమార్లు రాహుల్‌ గాంధీతో సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. కానీ ఈ సారి మాత్రం రాహుల్‌ గాంధీ పర్యటన ఖరారు అయినట్లే సమాచారం అందుతోంది. రాహుల్ వచ్చేలోపు పార్టీ ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నేతలు భావిస్తున్నారు. ఇక పెరిగిన ధరలపై ఆందోళనలు చేస్తూ ప్రజల్లో నమ్మకం కలిగించుకుంటున్నారు .