తిరుమలలో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అనుమానం

తిరుమల వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. ముఖ్యంగా కాలినడకన వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా కాలినడకన వెళ్లే భక్తులపై చిరుతలు దాడి చేస్తున్నారు. రీసెంట్ గా ఓ చిన్నారి ని చంపేశాయి. దీంతో అధికారులు కాలినడకన వెళ్లే భక్తులకు చిరుతల నుండి రక్షణ కోసం వారికీ కర్రలు ఇచ్చి కొండపైకి పంపుతున్నారు. మరోపక్క చిరుతలు బంధించే ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు చిరుతలు బందించగా..మరో ఐదు చిరుతలు తిరుమలలో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో చిరుతలతో పాటు ఎలుగుబంట్లు కూడా కనిపిస్తున్నాయి.

కాలినడక మార్గాల్లో 320కి పైగా ట్రాప్‌ కెమెరాలు, 36 బోన్లు ఏర్పాటు చేశారు. నామాలగవి ప్రాంత పరిసరాల్లో మొత్తం ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మరో రెండు చిరుతల్ని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ చిరుత బోన్‌ దగ్గరికి వెళ్లినట్టే వెళ్లి పక్క నుంచి వెళ్లిపోయింది. ఓ ఎలుగుబంటి కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు గుర్తించారు. ఈ రెండింటిని బంధించాలని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

శేషాచలంలో ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై క్లారిటీ లేదు. అయితే ట్రాప్‌ కెమెరాల్లో మాత్రం చిరుతల సంచారంతో వాటి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఆపరేషన్‌ చిరుతలో దాదాపు వెయ్యి మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అవసరమైతే ట్రాప్‌ కెమెరాలు.. అధునాతన బోన్లతో పాటు స్టాఫ్‌ని పెంచాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతుందని.. భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామంటున్నారు టీటీడీ, ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతానికి భక్తులకు సెక్యూరిటీ ఇస్తూ కొండపైకి పంపిస్తున్నారు.