సింహాచలం అప్పన్న స్వామి హుండీలో రూ.100 కోట్ల చెక్..

సాధారణంగా భక్తులు గుడికి వెళ్లితే..హుండీలలో కానుకలు సమర్పిస్తుంటారు. కొంతమంది చిల్లర వేస్తే…మరికొంతమంది పెద్ద నోట్లు వేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ భక్తుడు మాత్రం ఏకంగా రూ. 100 కోట్ల చెక్ వేసి ఆశ్చర్య పరిచారు. కానీ తీరా ఆ చెక్ ను తీసుకొని బ్యాంకు కు వెళ్తే దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు బ్యాంకు అధికారులు.

కొద్దిరోజుల క్రితం సింహాచలం కొండపై కొలువై ఉన్న సింహాచలం అప్పన్నస్వామి హుండీ లెక్కింపు జరిగింది. హుడీ లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చెక్‌ కనిపించింది. ఆ చెక్‌ చూసి వారు ఎంతో సంతోషించారు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయలకు ఆ చెక్కును రాసి హుండీలో వేసాడు. ఆలయ చరిత్రలో అదే పెద్ద మొత్తం కావటంతో వారు ఎంతో సంతోషించారు. దాన్ని ఈవో దగ్గరకు తీసుకెళ్లగా ఆయన సంబరపడ్డాడు. అయితే, అంత పెద్ద మొత్తం ఉన్న ఆ చెక్కు చెల్లుతుందా? లేదా? అన్న అనుమానం వచ్చి బ్యాంకు కు వెళ్లాడు. తర్వాత అసలు విషయం తెలిసి షాక్‌ అయ్యారు. 100 కోట్లకు చెక్‌ ఇచ్చిన ఆ భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నట్లు తేలింది. దీంతో ఆలయ అధికారులు షాక్‌ తిన్నారు. రాధాకృష్ణ అడ్రస్‌ అడుగుతూ బ్యాంకుకు లేఖ రాశారు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్‌ వేసి ఉంటే.. చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు.