వచ్చే నెల నుంచి తగ్గనున్న కూరగాయలు, చిరుధాన్యాల ధరలుః ఆర్‌బీఐ గవర్నర్

ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య

Vegetable prices in India to decline from September, says cenbank chief

న్యూఢిల్లీః సెప్టెంబర్ నుంచి దేశంలో కూరగాయల ధరలు తగ్గుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బుధవారం ప్రకటించారు. ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ చిరుధాన్యాల ధరలు కూడా అదుపులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ అది క్రమక్రమంగా తగ్గుతోందని, ఆర్బీఐ చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయనేందుకు ఇది నిదర్శనమని చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉంటామని ఆయన తెలిపారు.

ఇటీవల కాలంలో కూరగాయలు, చిరుధాన్యాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ధరల పెరుగుదల కట్టడికి ఆర్బీఐ గతేడాది మే నుంచీ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

కాగా, ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి కేంద్ర బ్యాంకు కట్టుబడి ఉందని ఆర్బీఐ చీఫ్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధికి ధరల్లో స్థిరత్వం కీలకమని ఆయన తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి అనుకూల వాతావరణం కూడా ఉందని పేర్కొన్నారు. రూపాయి విలువ స్థిరీకరణ కోసం డాలర్లను నిల్వచేసుకుంటున్నామని కూడా ఆయన వెల్లడించారు. వ్యవస్థాగతంగా బలం పుంజుకునేందుకు విదేశీ కరెన్సీ నిల్వలు పెంచుకుంటున్నట్టు వివరించారు.