వరుస పేపర్ లీక్స్ తో పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత..

వరుసగా పదో తరగతి పేపర్స్ లీక్స్ తో విద్యాశాఖ కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. తెలుగు , హిందీ పేపర్ లీక్ కావడం తో ఈరోజు నుండి జరిగే పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే పరీక్షలు జరుగుతున్న ప్రతి కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ సిబ్బందిని కూడా పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

క్రిమినల్‌ కేసులుండి, వ్యక్తిగత నేపథ్యం సరిగా లేని ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ నిరోధానికి ఇప్పటివరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను మాత్రమే నియమిస్తూ వస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన (సీ-కేటగిరీ) 318 పరీక్షా కేంద్రాల్లోనే సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మిగిలిన 2,334 కేంద్రాల్లోనూ సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమిస్తున్నారు.

మరోపక్క టెన్త్‌ హిందీ పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జైలుకు వెళ్లారు. లీకేజీకి ఆయనే ప్రధాన సూత్రధారి అంటూ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా.. సంజయ్‌కి మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. సంజయ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను గురువారం విచారణ జరుపుతామని మెజిస్ట్రేట్‌ చెప్పడంతో ఆయనను కరీంనగర్‌ జైలుకు తరలించారు.