ఓఎల్ఎక్స్ లో 800 మంది ఉద్యోగులకు కోత

వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టిన ఓఎల్ఎక్స్

Olx Sacks 800 Jobs Globally After Shutting Down Olx Auto In Several Regions

న్యూఢిల్లీః ఓఎల్ఎక్స్ సంస్థ లేఆఫ్స్ ను ప్ర‌క‌టించింది. ఆటోమోటివ్ బిజినెస్ యూనిట్ ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకుల‌తో నడుస్తోంది. దీంతో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. స్ధూల ఆర్ధిక వాతావ‌ర‌ణం ప్ర‌తికూలంగా మార‌డంతో ఈ ఏడాది ఓఎల్ఎక్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లేఆఫ్స్ నిర్ణయం వెలువడింది. తాము కంపెనీ నుండి వైదొలిగామని ఓఎల్ఎక్స్ ఆటోమెక్సికో ఉద్యోగులు ఇప్పటికే లింక్డిన్ లో పోస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఉద్యోగాలు కోల్పోయే వారికి అవసరమైన సాయమందిస్తామని ఓఎల్ఎక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటో బిజినెస్ లో 800 మందిని తొలగించనుంది.

అయితే టాప్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌పై లేఆఫ్స్ ప్రభావం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అనిశ్చిత ఆర్థిక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని మార్కెట్ల నుండి ఓఎల్ఎక్స్ ఆటోస్ నిష్క్రమించడం మేలని కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దీటైన ఇన్వెస్ట‌ర్లు కొర‌వ‌డ‌టంతో అర్జెంటీనా, మెక్సికో, కొలంబియా మార్కెట్ల‌లో ఒఎల్ఎక్స్ ఆటోస్‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కంపెనీ ప్ర‌తినిధులు వెల్లడించారు. ఓఎల్ఎక్స్ ఆటో ఇండియా వెబ్‌సైట్ కొనసాగుతోంది. ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నట్లు ఓఎల్ఎక్స్ మాతృసంస్ధ వార్షిక నివేదిక‌లో తెలిపింది.