పోలీసుల వేధింపులకు నంద్యాలలో దళిత యువకుడి ఆత్మహత్య బాధాకరం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది.. చంద్రబాబు

tdp-chief-chandrababu-naidu-tweets-on-nandyala-incident

అమరావతిః నంద్యాలలో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో బడుగుల హత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో యువకుని ఆత్యహత్య.. వ్యవస్థ చేసిన హత్యేనని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్నారని 2020 నవంబర్‌లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందో.. అదే పోలీస్ స్టేషన్ అధికారుల వేధింపుల కారణంగా నేడు చిన్న బాబు రైలు కింద పడి ప్రాణాలు తీసుకోవడం విషాదకరం’’ అని పేర్కొన్నారు.

రక్షణ ఇవ్వాల్సిన పోలీసుల వల్లే ప్రాణాలు పోయే పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లారని చంద్రబాబు మండపడ్డారు. నంద్యాల ఘటనలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయాలని ట్వీట్ లో పేర్కొన్నారు.