అసెంబ్లీలో స్పీక‌ర్‌పైకి కుర్చీ ఎత్తిన ఒడిశా ఎమ్మెల్యే

గనుల అక్రమాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ వాయిదా తీర్మానం
చ‌ర్చ‌కు అంగీక‌రించ‌ని స్పీక‌ర్

భువనేశ్వర్‌: ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బహినిపాటి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే దానిని స్పీకర్‌ ఎస్‌ఎన్‌ పాత్రో తిరస్కరించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన తారాప్రసాద్‌ స్పీకర్‌ పోడియం ముందున్న కుర్చీని పైకిలేపి ఎత్తేశాడు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ అయిన తారా ప్రసాద్‌.. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్‌ అక్రమాలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. జీరో అవర్‌లో దానిపై చర్చించాలని పట్టుబట్టారు. దానికి స్పీకర్‌ తిరస్కరించారు. అనంతరం భోజన విరామం తర్వాత కూడా అదే అంశంపై చర్చకు అనుమతించాలని కోరాడు. గనుల యజమానులు అక్రమంగా మైనింగ్‌తో ఒడిశాను దోచుకుంటున్నారని ఆరోపించాడు. అయితే చర్చకు స్పీకర్‌ పాత్రో నిరాకరించడంతో ఆవేశంతో ఊగిపోయిన తారాప్రసాద్‌.. హెడ్‌ఫోన్స్‌ విరగొట్టారు. అంతటితో ఆగకుండా పోడియంలోకి దూసుకెళ్లారు. పోడియం ముందున్న కుర్చీని పైకెత్తి పడేయడంతో అది విరిగిపోయింది. కాగా, ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/