ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

డిప్యూటీ స్పీకర్ పదవికి నిన్న రాజీనామా చేసిన కోన రఘుపతి

AP Assembly
AP Assembly

అమరావతిః ఏపి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేస్తున్నట్టు సమాచారం. ఆయన ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేస్తారని చెపుతున్నారు. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపకపోవచ్చు.

మరోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటనే ఆమోదించారు. దీంతో, ఖాళీ అయిన డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. ఇంకోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం ఇంత వరకు తెలియరాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/